ఎంతో విలువైన సాహితీ సేవ చేస్తూ తెలుగు పద్యానికి అక్షర పట్టాభిషేకం చేసి అనేక పద్య రచనలు చేశారు అచ్యుతానంద బ్రహ్మచారి. పండితుల చేత ప్రశంసలు పొందిన ఈ సాధన బ్రహ్మ వరంగల్ దగ్గర పత్తేపురం గ్రామంలో నరెడ్ల రాజయ్య, పిచ్చమ్మ దంపతులకు 6 ఆగస్టు 1948న జన్మించారు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎల్లయ్య. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆయన నాన్నమ్మ, పెద్దమ్మల దగ్గర పెరిగారు.
ఇంట్లో చదివించే స్తోమత లేదు. కానీ.. చదువు మీద మమకారంతో ఇంటి నుంచి పారిపోయారు. కూలి పనులు చేసుకుంటూ సంచార జీవితం గడిపాడు. చివరకు గుంటూరు చేరి అక్కడి గౌడీయమఠంలో ఆశ్రయం పొందారు. అక్కడి గురువులు ఆయనలోని ప్రతిభ, విద్యాభిలాషలు గమనించారు. ఆశ్రమంలోని గురువుగారు తీర్థ గోస్వామి మహారాజ్ ఎల్లయ్యలోని ఆసక్తి, ఆధ్యాత్మిక ప్రవర్తనలకు ముగ్ధుడై ‘అచ్యుతానంద బ్రహ్మచారి’గా నామకరణం చేశారు.
మఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ కలకత్తా వరకు వివిధ ప్రాంతాల గుండా పర్యటించారు.చివరకు విజయనగరం మహారాజా కళాశాలలో ప్రవేశం పొంది సంస్కృతం నేర్చుకుని భాషా ప్రవీణ పూర్తి చేసి జన్మభూమి వరంగల్‌కు చేరుకున్నారు. అక్కడ తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసుకున్నారు. అంతర్ జిల్లా కోటాలో ఖమ్మం జిల్లాలో తెలుగు పండితుడిగా ప్రభుత్వ ఉద్యోగం పొంది పాల్వంచ, ముదిగొండ, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పనిచేశారు. ఎందరో విద్యార్థులకు తెలుగు భాష సొగసులు పంచి ఉన్నతులుగా తీర్చిదిద్దారు. తాను కూడా ఉన్నత చదువులు పూర్తిచేశారు.
చిన్నతనంలో తన తండ్రి రాజయ్య వేసే వీధి నాటకాల ప్రేరణతో సంగీతం మీద పద్యాలు పాడటంలో మక్కువ పెరిగింది. సంస్కృతం నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగింది.అలా బాల్యం నుంచి సంగీత, సాహిత్యాల పట్ల మక్కువ పెంచుకున్న బ్రహ్మచారి ఒకవైపు చదువు, ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తూనే తనకు తెలిసిన ఇష్టమైన సంస్కృత, తెలుగు భాషలోని అనేక కావ్యాలు అధ్యయనం చేశారు. అనంతరం రచనా వ్యాసంగం ప్రారంభించి తెలుగులో అనేక పద్య రచనలు చేశారు.
2006లో ఉద్యోగ విరమణ అనంతరం తన రచనా సద్యోగం విస్తృతం చేసుకొని 20 వరకు పుస్తకాలు వెలువరించారు. ఆయన రచనల్లో ప్రధానమైనవి ఏడు శతకాలు. మిగిలినవి పద్య కావ్యాలు. ఆయన చేసిన ఆకాశవాణి ప్రసంగాలను ‘ప్రసంగఝరి’ పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఇందులో ఆధ్యాత్మిక సామాజిక అంశాలతో కూడిన విషయాలు పొందుపరిచారు.
పరమ భక్తి భావన గల బ్రహ్మచారి ఆ పరమాత్ముని కృపతో గురువుల ఆశీస్సుల బలంతోనే ఈ సాహితీ కృషి చేస్తున్నట్లు సవినయంగా తెలిపిన నిజమైన భుదజన విధేయుడు. ఆయనలోని సంగీత పరిజ్ఞానం, సంస్కృత జ్ఞానం కలగలసి పద్యాలకు చక్కని లయ అలవడింది. ఆయన చదివిన కావ్యాల్లోని గుణాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ తనదైన సరళ శైలిలో అలతి పదాలు మేళవించి, అందమైన ఆధునిక సామాజిక అంశాలు జతచేసి, చక్కని కావ్యంగా మలిచి పద్య ప్రియులకు కానుకగా అందించారు.
సాధారణ ఛందస్సులతోపాటు విశేష ఛందస్సులు, రాగడలు, దండకాలు సందర్భానుసార వచనంతో ‘సాందీపనీ చరిత్ర’ను అందించారు అచ్యుతానంద బ్రహ్మచారి. ఆయన పద్య యశోకీర్తిలో ఇది ఒక కలికితురాయిగా నిలిచింది. సౌమ్యుడు, స్నేహశీలి అయిన అచ్యుతానంద బ్రహ్మ సాధన, నిత్య అధ్యయనం, రచన వ్యాసంగంతో తన విశ్రాంత జీవితాన్ని పరిపుష్టం చేసుకున్నారు. సాధనతో సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించి నేటి ఆధునిక కవులకు ఆదర్శంగా నిలిచిన ఆయన అనారోగ్యంతో 2025 ఫిబ్రవరి 7న ఆఖరి శ్వాస వదిలారు.
శ్రీకృష్ణ, రాధికానాధ, పరమహిత, మహిళ, వేణుమాధవ, అచ్యుతాంగ్రి, శ్రీరామనాథ, శతకాలతోపాటు కవితలహరి, గీతాఝరి, సూక్తి సుధ, సుధా వర్షిణి, సమస్యతోరణం, బాల గేయాలు, బ్రహ్మచారి పద్య రచనల్లో ప్రధానంగా చెప్పవచ్చు. ఆయన పద్య రచనలన్నీ ఒక ఎత్తు ‘‘సాందీపని చరిత్ర” ఒక్కటి ఒక ఎత్తు. గురువుల ద్వారా శిష్యులకు ఉన్నతి కలగటం సాధారణం. కానీ, శిష్యుల వల్ల గురువుకు కీర్తి కలగటం అసాధారణం. అటువంటి అసాధారణ సంబంధ కావ్యమే ఈ సాందీపని చరిత్ర. నిస్వార్థ స్నేహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే శ్రీకృష్ణ, కుచేలుల ఆత్మీయ గురువు సాందీపుడు.
భాగవతంలోని ఒక చిన్న కథను తీసుకొని ఏడు అశ్వాసాల ప్రబంధ కావ్యంగా ‘‘సాందీపని చరిత్ర” రాయడంలో బ్రహ్మచారి గారి పద్య ప్రతిభ తెలుస్తుంది. దీనిలో అందరికీ తెలిసిన అంశాలతో పాటు ఎన్నో ఆధునిక సామాజిక అంశాలు జోడించి సులభ శైలిలో అందించారు.
- డా. అమ్మిన శ్రీనివాసరాజు ,సెల్:77298 83223-
